లోకల్ వివాదంలో సన్ రైజర్స్

ఐపీఎల్-2021 కోసం అడుగు ముందుకు పడింది. ఇటీవలే వేలం జరిగింది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు, ఆల్ రౌండర్లని కోట్లు కుమ్మరించి కొనుకున్నారు. ఇక లోకల్ ఆటగాళ్లని అగ్గువ ధరకు, సీనియర్లని బేసిడ్ ప్రైజ్ కి సొంతం చేసుకున్నారు. టీమిండియా టెస్ట్ ఆటగాడు పుజారాకు కూడా చోటు దక్కింది. అతడిని రూ. 50లక్షలకు చెన్నై తీసుకుంది. వేలం పాటకు సంబంధించి ఏ జట్టు విషయంలో వివాదాలు తలెత్తలేదు. ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ కు తప్ప.

సన్ రైజర్స్ లోకల్ వివాదంలో ఇరుక్కుంది. ఆ జట్టు ఒక్కడంటే ఒక్క స్థానిక ఆటగాడిని తీసుకోలేదు. హైదరాబాద్ యువ ఆటగాళ్లని ఇతర జట్లు తీసుకున్నాయ్. కానీ సన్ రైజర్స్ తీసుకోలేదు. కనీసం వారిని తీసుకొనేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ పై తీవ్ర విమర్శలొస్తున్నాయ్. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ సన్ రైజర్స్ తీరుపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇదే రీతిలో స్పందించారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన వార్నర్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడని, స్థానిక ఆటగాళ్లకు స్థానం లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజహర్, నాగం దారిలో సన్ రైజర్స్ పై విమర్శలు, అసంతృప్తిని వ్యక్తం చేసే జాబితా ఇంకా పెరగనుందని తెలుస్తోంది. అది కాస్త లోకల్ వార్ కి దారితీస్తే సన్ రైజర్స్ కష్టాలు తప్పకపోవచ్చు. కనీసం వచ్చే వేలంలోనైనా.. ఆ జట్టు లోకల్ ఆటగాళ్ల ని తీసుకోక తప్పని పరిస్థితి మాత్రం ఏర్పడేలా ఉంది.