ఐపీఎల్-2021 వేదికల ఎంపిక వెనక రాజకీయాలు ?

ఐపీఎల్-2021 షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 9 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మే 30 వరకు కొనసాగనుంది. ఆరు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలో పోరుతో సీజన్‌ షురూ కానుంది.

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతుందనుకున్న హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. దేశంలోని అత్యుత్తమ క్రికెట్‌ స్టేడియాల్లో ఒక్కటైన ఉప్పల్‌కు మాత్రం మొండిచెయ్యే చూపారు. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ.. పాజిటివ్‌ కేసులు, మరణాలు అధిక సంఖ్యలోనే నమోదవుతున్నప్పటికీ లీగ్‌ నిర్వహణ కోసం ముంబయిని ఎంపిక చేసిన బీసీసీఐ.. వైరస్‌ ప్రభావం చాలా తక్కువగా ఉన్న భాగ్యనగరాన్ని విస్మరించింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానం (మొతేరా) లీగ్‌ దశలో 8 మ్యాచ్‌లతో పాటు కీలకమైన ప్లేఆఫ్‌, ఫైనల్‌ పోరుకూ ఆతిథ్యమివ్వనుంది. అక్కడి నుంచి ఐపీఎల్‌లో పోటీపడే ఫ్రాంఛైజీ లేనప్పటికీ.. ఈ ఏడాది మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేదికల వెనక రాజకీయాలు నడిచాయని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.