బెంగళూరు సీన్ సూపర్ హిట్
బెంగళూరు సీన్ సూపర్ హిట్టయ్యింది. అదే కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం. ఈ కార్యక్రమం ద్వారా భాజాపా యేతర కూటమి ఐక్యత చాటనుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈ కార్యక్రమం జరిగింది. దీంతో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల లక్ష్యం నెరవేరినట్టయింది.
2019 సాధారణ ఎన్నికలకు ఇంకో పది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ‘థర్డ్ ఫ్రంట్’ని తెరపైకి తీసుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలెట్టారు. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేష్, ప.బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్లారు. ప్రాంతీయ పార్టీలని ఐక్యం చేసే దిశగా చర్చలు మొదలెట్టారు.
ఇప్పుడు ‘బెంగళూరు సీన్’ కేసీఆర్ ప్రయత్నాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లినట్టయ్యింది. ఐతే, కేసీఆర్ కోరుకొన్నట్టు భాజాపాతో పాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమి ఏర్పడం లేదు. కాంగ్రెస్ లేకుండా థర్డ్ ప్రంట్ ఏర్పాటు చేయడం అసాధ్యమనే అభిప్రాయం వెలువడుతోంది. ఇదే బెంగళూరు సీన్ కు కేసీఆర్ దూరంగా ఉండేలా చేసిందని చెప్పవచ్చు. లేదంటే బెంగళూరు సీన్ లో కేసీఆర్ మాటల తూటాలు దేశ ప్రజలు వినే అవకాశం దక్కేది.
ఇక, కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సిఎం పినరయ్ విజయన్, బీఎస్సీ అధినేత్రి మాయావతి, ఆర్జేడీ అధినేత కుమారుడు, మాజీ మంత్రి తేజస్వి ప్రసాద్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు.
మొత్తానికి.. బెంగళూరు సీన్ భాజాపాకు ఓ హెచ్చరిక. థర్డ్ ఫ్రంట్’కు ఏర్పాటుకు పునాది. తమ తమ ప్రభాల్యాన్ని కాపాడుకోవాలని ఆశపడుతున్న ప్రాంతీయ పార్టీల ఐక్యతని చాటి చెప్పింది. మరీ.. ఈ ఐక్యత భాజాపా బలాన్ని ఏ మేరకు దెబ్బకొట్టనుందనేది ముందు ముందు చూడబోతున్నాం.