డీఎస్సీ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో ఉద్యోగులు, నిరుద్యోగులు అసంతృప్తిలో ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం.. వారిని ఖుషి చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతలు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు చేస్తున్నట్టు ఒకేసారి ప్రకటించింది. దాదాపు 50వేల ఉద్యోగాలని ఒకేసారి భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే వీటిలో ఎక్కువగా  పోలీస్, టీచర్ కొలువులే ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


 అయితే టీచర్ ఉద్యోగాల కోసం పరీక్ష(డీఎస్సీ) నిర్వహించాలంటే ముందుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను జరపాల్సి ఉంటుంది. టెట్ లో అర్హత సాధించి వారు మాత్రమే డీఎస్సీ రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డీఎస్సీ రెండింటికీ ఒకే పరీక్ష నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు విద్యాశాఖ నిపుణుల కమిటీని నియమించింది.ఈ కమిటీలో విద్యాశాఖ అధికారులతో పాటు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌, ఓయూ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు మరికొంత మందిని అధికారులు నియమించారు.