హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు
ఊహించినట్టుగానే తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్లో కోరారు.
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు… ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం కింద చంద్రబాబు మీద సీఐడీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీలోని 41(ఏ)(1) ప్రకారం సీఐడీ నోటీసులిచ్చింది. తాజాగా దీనిని సవాల్ చేస్తూ.. చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.