డేంజర్ బెల్స్ : ఒక్కరోజులోనే 200 కరోనా మరణాలు


దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 43,846 కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కి చేరింది. కొత్తగా 22,956 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,30,288కు చేరి.. రికవరీ రేటు 96.12శాతానికి తగ్గింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 188 నమోదు కాగా.. శనివారం రికార్డు స్థాయిలో 197 మంది మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,755కి చేరింది.


ఇక మహారాష్ట్రను కరోనా విణికిస్తోంది. నిన్న ఒక్కరోజు అక్కడ 27వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. గడిచిన 24గంటల్లో 25.40లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 4,46,03,841కి చేరింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు ఇండోర్‌, భోపాల్‌, జబల్‌పూర్‌ల్లో ఆదివారం ఒకరోజు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.