మోత్కుపల్లి నెక్ట్స్ స్టెప్ అదేనా..?
విపరీత ధోరణి ప్రదర్శించి టీడీపీ నుంచి బహిష్కృతుడైన మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించడమే కాకుండా ఏపీలో సైతం తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరే విధంగా ప్రవర్తించడం వ్యూహాత్మకమనే భావన కలుగుతోంది చాలామందికి.
తెలుగుదేశం పార్టీతో బంధం తెగిపోయిన నేపథ్యంలో ఇక ఆయన ఏ పార్టీలో చేరతారు.. రాజకీయంగా ఎలాంటి వ్యూహంతో ముదుకెళతారనేదానిపై ఒక్కొక్కరు ఒక్కోలా అంచనాలు వేసుకుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శిస్తూనే మరోవైపు కేసీఆర్ ను పొగడటంపై ఇక ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెళ్లడం ఖాయమనే ప్రచారం మొదట్లో జరిగినా పార్టీలో కొంత మంది నుంచి వ్యతిరేకత రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని పునరాలోచించే ధోరణి ప్రదర్శిస్తుండటంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. మోత్కుపల్లి అనుచరులకు కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో వారు అయోమయంలో పడిపోయారట.
మోత్కుపల్లి మాట్లాడిన ప్రతీసారి ఆలేరు నియోజకవర్గ ప్రజల దీవెనల వల్లే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొస్తుండటం, ఆలేరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తానంటూ పలుమార్లు ధీమావ్యక్తం చేయడాన్ని బట్టి చూస్తే .. వచ్చే ఎన్నికల్లో ఆయన ఆలేరు నుంచి బరిలోకి దిగడం ఖాయమనే అభిప్రాయం నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఆలేరు నియోజవకర్గంలో మోత్కుపల్లికి ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ గతంలో ఉన్న రాజకీయ పరిస్థిలుకు, వచ్చే ఎన్నికల నాటి రాజకీయ పరిస్థితులకు కుదిరే అవకాశం కనిపించడంలేదు. చంద్రబాబు ఓటమిని కోరుతూ తిరుమలకు కాలినడకన వెళతానని చెప్పిన ఆయన, అవసరమైతే ఏపీలో రథ యాత్ర కూడా చేస్తానని చెప్పడం కూడా వైసీపీ, జనసేనలతో దోస్తీకట్టినా ఆశ్చర్యపోనవసరంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలిమరి మోత్కుపల్లి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళతారో..