కాలేజీకి వెళ్లడానికి కష్టపడ్డా : నితిన్

ఈ వయసులో కాలేజీకి వెళ్లడానికి కష్టపడ్డానని తెలిపారు హీరో నితిన్. ఆయన తాజా చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. నితిన్ కి జంటగా రాశీఖన్నా నటించారు. ఈ వారమే (మార్చి 26) రంగ్ దే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


ఈ సందర్బంగా నితిన్ మాట్లాడుతూ.. ” ముప్పైల వయసులో ఉన్న నేను ‘రంగ్‌దే’లో కాలేజ్‌ యువకుడిగా కనిపించాలని దర్శకుడు చెప్పగానే షాక్‌ అయ్యాను. అది సాధ్యమవుతుందా? అనే అనుమానం వచ్చింది. కానీ వెంకీ.. నచ్చజెప్పి నటించేలా చేశాడు. ఆయన కథ చెప్పిన విధానం నన్ను కట్టిపడేసింది. దాంతో యువకుడిగా కనిపించడం కోసం ఫిట్‌నెస్‌ విషయంలో ఎంతో శ్రమించా. బరువు తగ్గా.. గడ్డం తీసేశా. ఈ సినిమాలో నేను ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌గా కనిపిస్తాను. కామెడీ, డ్రామా, లవ్‌.. ఇలా అన్ని కోణాలు నా పాత్రలో ఉంటాయి” అని నితిన్‌ తెలిపారు.