రంగ్ దే – జీవితంలో ఉన్న ఏడు రంగులను చూపిస్తుంది : త్రివిక్రమ్
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రిరిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “అన్ని జంతువులు నవ్వలేవు.. మనిషి మాత్రమే నవ్వగలడు. అలాగే అన్ని జంతువులకు ఏడు రంగులను చూసే అవకాశం ఉండదు. మనిషికి మాత్రమే అన్ని రంగులను చూసే అదృష్టం ఉంది. అలాంటిది ‘రంగ్ దే’ పేరుతో వస్తున్న ఈ సినిమా కూడా జీవితంలో ఉన్న ఏడు రంగులను చూపిస్తుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.
సినిమాలో నాకు బాగా నచ్చినవి అర్జున్, అను(నితిన్, కీర్తి) పాత్రలు. నితిన్ నా సోదరుడిలాంటి వాడు. నా మిత్రుడు దేవి శ్రీప్రసాద్. చాలామంది సంగీత దర్శకులు ఉంటారు. కానీ.. డీఎస్పీ మాత్రం ఒక ప్యాకేజీ. ఎలాంటి పాటకైనా మనతో స్టెప్పులేయించగలరు. మన దేశంలో అతి కొద్దిమంది గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి ఒకరు. అందుకే టాప్‌లో దూసుకెళుతున్నారు” అన్నారు.