ఉద్యోగులకు డబుల్ ట్రీట్ ఇచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది పెద్ద చేయి అని మరోసారి నిరూపించుకున్నారు. చాన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీని ఈరోజు శాసనసభ వేదికగా ప్రకటించారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
పీఆర్సీ ప్రకటించడం మాత్రమే కాదు.. ఇకపై ఐదేళ్లకోసారి కచ్చితంగా పీఆర్సీని ప్రకటిస్తామని తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ ప్రకటన కొంత ఆలస్యమైంది. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక ఇచ్చింది. సీఎస్ అధ్యక్షతన కమిటీ నివేదికపై అధ్యయనం చేసిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా సీఎస్ కమిటీ చర్చించిందని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైందని కేసీఆర్ అన్నారు. 30 శాతం ఫిట్మెంట్ ప్రకటనపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఝతలు తెలియజేస్తున్నారు.