సీఎం కేసీఆర్.. ఒక్కసారి పీఎం అయితే.. !
కేసీఆర్ – పట్టు వదలని విక్రమార్కుడు. ఆ పట్టుదలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సాధించిన తెలంగాణకు తొలి, మలి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ, కేసీఆర్ లో ఓ తీరని కోరిక ఉంది. అదే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం. అవునూ.. రాష్ట్రాన్ని కొడుకు కేటీఆర్ లో పెట్టేసి.. తాను దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలనే ఆశ, ఆలోచనలో కేసీఆర్ లో ఉండేవి. తెలంగాణ అసెంబ్లీ (2018) ఎన్నికలకు ముందు దేశంలో థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్తా. గత్తర లేపుతా. భాజాపా, కాంగ్రెస్ యేతర పార్టీలని ఏకం చేస్తానని గర్జించారు.
ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసినా.. వర్కవుట్ కాలేదు. అంతేకాదు.. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనక భాజాపా ఉందనే ఆరోపణలొచ్చాయ్. ఇక ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలోనూ.. దేశ రాజకీయాలపై అదే రకమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్తా. ఈ దేశానికి పట్టిన శని భాజాపాని వదిలించేదుకు తన ప్రయత్నం చేస్తానన్నారు. చెప్పినట్టుగానే గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర పెద్దలకు వంగి వంగి దండాలు పెట్టేసి వచ్చారు. దీనిపై తెలంగాణ భాజాపా నేతలు పెద్ద కామెడీ కూడా చేశారు.
అయితే కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారాలనేది కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. సీఎం కేసీఆర్ కడుపునింపిన మాటలు మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగానే దేశాన్నీ ప్రగతిపథంలోకి తీసుకెళతారని చెప్పారు. సీఎం ఒక్కసారి పీఎం అయితే దేశచరిత్రే మారిపోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ శాసనసభలో కార్మిక, ఉపాధి కల్పన పద్దుపై చర్చ సందర్భంగా మల్లారెడ్డి ఈ వాఖ్యలు చేశారు.