పవన్ వ్యాఖ్యలకు సంకేతం అదేనా..?
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. రొటీన్ కు భిన్నంగా గత ప్రసంగానికి భిన్నంగా వ్యవహరిస్తూ రాజకీయంగా ముందుకెళుతున్నారు. బీజేపీ అనుకూలుడిగా జగన్ తో పవన్ జతకడుతున్నారని అధికార టీడీపీ ముద్ర వేసినా.. ఏపీలో జనసేన పోరాట యాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు పవన్. అధికారం కోసం కాదు పోరాటం కోసమే జనసేన ఆవిర్భవించిందని చెప్పుకొస్తూ వస్తున్న పవన్ తాజాగా రూటు మార్చారు. సీఎం పదవికి అనుభవం కావాలంటూ అధికారంపై ఆసక్తి చూపని పవన్ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
జనసేన పోరాట యాత్ర ప్రారంభంలో ప్రత్యేక హోదాపై అధికార టీడీపీపై విమర్శల వర్షం కురిపించిన పవన్ ప్రాంతాల వారీగా సమస్యలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను చెబతూ, తన నమ్మకాన్ని టీడీపీ నిలుపుకోలేదని, హోదా అంశంలోనూ టీడీపీ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు పవన్. జగన్ ను విమర్శించకపోవడం తనకు మైనస్ అవుతుందనుకున్నారో ఏమోగానీ , పరోక్షంగా జగన్ ను కూడా విమర్శించడంమొదలుపెట్టారు జనసేనాని.
జనసేన పోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో జరిగిన సభలో తన మాటల పదును పెంచి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారం ఆ రెండు కుటుంబాలదేనా అంటూ పవన్ విమర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కావాలంటే అనుభవం కావాలి, జనసేన కేవలం పోరాటాల కోసమేనంటూ చెప్పుకొచ్చిన పవన్ సడన్ గా రూటు మార్చడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రెండు కుటుంబాలు అంటూ ఇటు చంద్రబాబు నాయుడును, అటు జగన్ ను పరోక్షంగా విమర్శించడం వెనక అంతరార్ధం ఏమిటంటూ కొందరు విశ్లేషించుకుంటున్నారు. పవన్ పవర్ పాలిటిక్స్ వైపు వెళుతున్నారనే సంకేతాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనకు పట్టం కట్టాలని పవన్ పరోక్షంగా చెప్పారని, పవన్ ను సీఎం అవుతారంటూ అభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే రూటు మారుస్తున్న పవన్ ఎన్నికల నాటికి స్పీడ్ పెంచవచ్చనే అభిప్రాయం వెలువడుతోంది. ముందు ముందు రాజకీయంగా పవన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది చూడాలి.