రివ్యూ : రంగ్ దే

చిత్రం : రంగ్ దే (2021)

నటీనటులు : నితిన్, కీర్తీ సురేష్, నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్.. తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
రిలీజ్ డేట్ : 23 మార్చి, 2021.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. పక్కపక్క ఇళ్లలో ఉండే అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సి వస్తే వాళ్ల పరిస్థితి ఏంటనే లైన్‌ ఆధారంగా ఈ కథని రాసుకొన్నానని సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు తెలిపారు. ఒక్కో రంగు ఒక్కో భావోద్వేగాన్ని సూచిస్తుంది. అందుకే ‘రంగ్‌ దే’ అనే పేరు పెట్టాం అన్నారు. మరీ.. రంగ్ దేలో ఎన్ని భావోద్వేగాలు పండాయ్. ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకున్నాయ్.. తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ
పక్కపక్క ఇళ్లలో ఉండే అనుపమ(కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఫ్యామిలీ ఫ్రెండ్స్. చదువుల్లో అర్జున్ అంతంత మాత్రమే. కానీ అనుపమ మాత్రం టాపర్. ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమతోపాటు ద్వేషం కూడా కొనసాగుతుంటుంది. అయితే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకొన్న అనుపమ కోరికకు తల్లి (రోహిణి) అడ్డుపడి పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంది. అర్జున్ మీద ప్రేమను చంపుకోలేక.. ఇష్టం లేని వివాహం చేసుకోలేక పెళ్లి పీటల మీద నుంచి లేచి రావడం స్నేహితుడి (అర్జున్)ని పెళ్లాడటం చకచకా జరిగిపోతాయి. 

తన ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిన క్రమంలో అసంతృప్తితో ఉన్న అర్జున్‌, అనుపమ ఉన్నత విద్య కోసం దుబాయ్‌కి వెళ్తారు. అక్కడ ఈ జంట కాపురం ఎలా సాగింది ? ఎలాంటి పరిస్థితుల్లో అనుపమ ప్రెగ్నెంట్ అవుతుంది? ప్రెగ్నెంట్ తర్వాత అర్జున్‌కు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకొంటుంది? ఫైనల్ వీరిద్దరు ఎలా కలిసిపోయారు. కాపురం చేశారు అన్నది మిగితా కథ.

ఎలా సాగిందంటే ?
అర్జున్, అనుపమ చిన్ననాటి లైఫ్‌తో సినిమా మొదలవుతోంది. టిట్ ఫర్ టాట్ లాంటి సీన్లు, సింగిల్ లైనర్స్ కామెడీతో సరదాగా సినిమా సాగిపోతుంటుంది. సన్నివేశాల్లో కొత్తదనం కనిపించకున్నా.. ట్రీట్ మెంట్ మాత్రం కొత్తగా ఉంటుంది. సరదా సరదాగా సాగిపోతున్న ఫస్టాఫ్ కు అర్జున్-అనుపమ పెళ్లి ట్విస్ట్ తో ముగించాడు.

అయితే సెకాంఢాఫ్  లో అసలు సిసలు కథని నడిపాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో ఫన్ రైడ్ కొనసాగితే.. సెకాంఢాప్ లో బలమైన ఎమోషన్స్ ని పడించాడు. చివర అర్ధగంటలో దర్శకుడు ప్రయోగించిన ఎమోషన్ అనే అస్త్రం సినిమా స్థాయిని పెంచేసింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్‌ వరకు సాగే కథా ప్రయాణంలో కీర్తీ సురేష్, నితిన్ తమ అద్భుత నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. రంగ్ దే.. ఎమోషనల్ ఎంటర్ టైనర్ సాగింది.

ఎవరెలా చేశారు ?
వెంకీ అట్లూరి పెద్ద ప్రయోగమేమీ చేయలేదు. కానీ రచయితగా హ్యూమర్, ఎమోషనల్ అంశాలను పక్కగా పండించడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. కీర్తి సురేష్ మహానటి అన్న సంగతి తెలిసిందే. అయితే మహానటి తర్వాత ఆమెకి మంచి పాత్ర పడలేదు. రంగ్ దేతో.. మరోసారి కీర్తి సురేష్ లోని అద్భుతమైన నటిని మరోసారి చూసే అవకాశం దక్కింది.

తొలిభాగంలో గ్లామర్ గా కనిపించిన కీర్తి.. రెండో భాగంలో మాత్రం ఎమోషనల్ గా కనిపించింది. సినిమాని తన భుజాలపై మోసింది. నితిన్ కంటే ఎక్కువ క్రిడిట్ కొట్టేసే పాత్రలో మెరిసింది. ఇక నితిన్ ఎప్పటిలాగే ఈజీగా నటించేశారు. ఆయనలో పరిణితి కనిపించింది. కామెడీ, ఎమోషన్స్ ని బాగా పండించారు. ఎమోషనల్ సీన్స్ లో కీర్తి-నితిన్ పోటీపడి మరీ నటించినట్టు కనిపించింది.

ఇష్క్, అఆ, భీష్మ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో ఇంకా పరిణితి చెందిన నితిన్ కనిపించారు. బహుశా.. పెళ్లి తర్వాత నితిన్ లో వచ్చిన పరిణితి కావొచ్చేమో.. ! అభినవ్ గోమటం, సుహాస్ తమ వంతుగా మంచి కామెడీని అందించారు. వారిద్దరి కామెడీ టైమింగ్ బ్రహ్మండంగా పేలింది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :
దేవి శ్రీ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయ్. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ అద్భుత:. ఇష్క్ తర్వాత ఇన్నాళ్లకు ఆయన నితిన్ సినిమాకు పని చేశారు. సంభాషనలు బాగున్నాయ్. హ్యూమర్, ఎమోషనల్.. రెండూ బలంగా రాసుకొన్నారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ప్లస్ పాయింట్స్ :

  • కీర్తి సురేష్, నితిన్ ల నటన
  • భావోద్వేగాలు
  • కామెడీ
  • ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
  • సినిమాటోగ్రఫీ
    మైనస్ పాయింట్స్ :
  • ఫస్టాఫ్ లో కొద్దిగా రీటీన్ సీన్స్
    ఫైనల్ గా : రంగ్ దే – కలర్ ఫుల్ & ఎమోషనల్ 
    రేటింగ్ :3.5/5