రివ్యూ : తెల్లారితే గురువారం

చిత్రం : తెల్లారితే గురువారం (2021)
నటీనటులు :  శ్రీ సింహ, చిత్ర శుక్ల, మిషా నారంగ్, రాజీవ్ కనకాల, సత్య తదితరులు
సంగీతం : కాల భైరవ
దర్శకత్వం : మణికాంత్ గెల్లి
నిర్మాతలు : రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని

రిలీజ్ డేట్ : 27 మార్చి, 2021.

‘తెల్లారితే గురువారం’ అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా టెన్షన్ పడిన సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా కొత్త దర్శకుడు మణికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది. పెళ్లి కొడుకు పెళ్లి మండపం నుంచి ఎందుకు పారిపోయాడు? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అనేదే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు తెలిపారు. రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకుల ని ఏ మేరకు ఆకట్టుకుంది ?? చూద్దాం.. పదండీ.. !!

కథ :
వీరేంద్ర (శ్రీ సింహా), మధు (మిషా నారంగ్) కుటుంబ సభ్యుల బలవంతం మీద అయిష్టంతోనే పెళ్లికి ఒప్పుకొంటారు. తెల్లవారితే పెళ్లి అనగా కుటుంబ సభ్యులు రిసెప్షన్ నిర్వహిస్తారు. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వీరేంద్ర, మధు చివరి నిమిషంలో పెళ్లి మంటపం నుంచి నుంచి పారిపోతారు. ఫంక్షన్ హాల్ నుంచి పారిపోయిన వారి జీవితంలో ఏం జరిగింది ? మధును వీరేంద్ర పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తాడు ? అలాగే వీరేంద్రతో పెళ్లికి మధు ఎందుకు వెనకడుగు వేస్తుంది ? వీరేంద్ర, కృష్ణవేణి ప్రేమకథ కు ముగింపు ఏమిటి ? అన్నది .. మిగితా కథ.

ఎలా సాగింది ?
ఇది మూడు ముక్కుల కథ. తెల్లారితే పెళ్లి అనగా.. వీరేంద్ర, మధు పారిపోతారు. వీరిద్దరికి ఇష్టం లేదు. అదెందుకు ? అనేదే అసలు కథ. పారిపోయిన వీరేంద్ర కృష్ణవేణితో తన ప్రేమకథని చెబుతాడు. అలాగే పెళ్లిపై అయిష్టత గురించి మధు చెబుతుంది. ఈ రెండు కాకుండా.. కృష్ణవేణి వీరేంద్రని ఎందుకు వదులుకుంది ? అనేది మరో పాయింట్. ఈ మూడు పాయింట్లని దర్శకుడు బలంగా చెప్పలేకపోయాడు. ఆ ఎమోషన్ క్యారీ చేయలేకపోయాడు.

కాకపోతే.. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సినిమాని నడిపే ప్రయత్నం అయితే కొంత మేరకు ఫలించింది. ఫస్టాఫ్ లో శ్రీసింహా, సత్యల మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. సెకాంఢాఫ్ లో సాగదీత అనిపిస్తుంది. సీన్లు కూడా ఏదో అతికించినట్టు అనిపిస్తుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కథ-కథనాలు గ్రిప్పింగ్ గా సాగలేదు.


ఎవరెలా చేశారు ?

 శ్రీ సింహ తన పాత్రకు న్యాయం చేశాడు. కథ-కథనాలు నీరసంగా ఉన్నా.. తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నటనలో మెచ్యురిటీ చూపించాడు. మధుగా మిషా నారంగ్, కృష్ణవేణిగా డాక్టర్ పాత్రలో చిత్రా శుక్ల ఫర్వాలేదనిపించారు. మిషా తన గ్లామర్‌తోను, నటనతోను ఆకట్టుకొన్నారు.

సత్య తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. సినిమాలో హైలైట్ పాత్ర సత్యదే. ఫస్టాఫ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి కారణం సత్య పాత్రనే. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :
ఈ సినిమా ద్వారా శ్రీసింహా కంటే కాల భైరవకు ఎక్కువ పేరు వస్తుంది. పాటలు సిట్యుయేషన్‌ పరంగా అలరించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. సినిమాలో సత్య కామెడీ, కాల భైరవ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకుంటారు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫి బాగుంది. సెకాంఢాఫ్ స్లోగా సాగింది. అనవసరమైన సీన్స్ చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • శ్రీ సింహా, సత్యల నటన
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ
    మైనస్ పాయింట్స్ :
  • కథ-కథనాలు
  • సాగదీత
    ఫైనల్ గా : వినోదం-ఎమోషన్-లవ్-రొమాన్స్.. అన్నీ ఉన్నాయ్. కానీ కథ-కథనాలు గ్రిప్పింగ్ ల్లేవ్ !
    రేటింగ్ : 2.75/5 
    నోట్ : ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.