ఆలియాకు కరోనా.. #RRR సేఫ్’యేనా ?
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. గత యేడాది మాదిరిగానే సామాన్యులు, సెలబ్రెటీలు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. రణ్‌బీర్‌కపూర్, మాధవన్, ఆమిర్‌ఖాన్, పరేష్ రావల్, కార్తిక్ ఆర్యన్, మనోజ్ వాజ్‌పేయీలకు కరోనా సోకింది. తాజాగా స్టార్ హీరోయిన్ ఆలియాభట్ కు పాజిటివ్ గా తేలింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆలియానే తెలిపింది. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితం తెలిసిన వెంటనే ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. వైద్యుల సూచనలు పాటిస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. దయచేసి జాగ్రత్తగా ఉండండి’ అని ఆలియా ట్విట్ చేశారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘గంగూబాయ్ కతియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాల్లో ఆలియా నటిస్తున్నారు. అయితే ఆలియాకు కరోనా సోకడం వలన ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందానికి కలిగే నష్టమేమీ లేదని సమాచారమ్. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిసింది. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ వరకు ఆలియా అందుబాటులో ఉంటే సరిపోతుందని సమాచారమ్. మరోవైపు, అజయ్ దేవగణ్ బర్త్ డే కానుకగా.. ఆర్ ఆర్ ఆర్ ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.