4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కొనసాగుతున్న పోలింగ్
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. మరోవైపు అసోం, బెంగాల్ శాసనసభలకు మూడో దశ పోలింగ్ జరుగుతోంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొత్తం 475 స్థానాల్లో 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీకి మూడో దశలో భాగంగా 31 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మూడో దశలో భాగంగా ఇక్కడ 31 స్థానాలకు గానూ 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళనాడులో నేడు ఒకే దశలో 234 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కేరళలోనూ 140 స్థానాలకు గానూ నేడు ఒకే దశలో పోలింగ్ ప్రారంభమైంది. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసోంలో చివరి దశ పోలింగ్ లో భాగంగా.. మొత్తం 40 స్థానాలకు పోలింగ్ మొదలైంది. మొత్తం 40 స్థానాలకు 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో నేడు ఒకే దశలో 30 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా 10,04,197 మంది ఓటర్లు ఉన్నారు.