తన పరీక్ష ఇప్పుడే పూర్తయింది : ఉదయనిధి
234 నియోజకవర్గాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఈరోజు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే లతో పాటు కమల్ హాసన్ పార్టీ భవితవ్యాన్ని నేడు ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. డీఎంకే తరపున బరిలో ఉన్న యువనేత ఉదయనిధి స్టాలిన్ కుటుంబసభ్యులతో కలిసి తేనంపేట పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉదయనిధి.. పోలింగ్‌ను పరీక్షలతో పోల్చారు. తన పరీక్ష ఇప్పుడే పూర్తయింది అన్నారు. నాతో పాటు ప్రతి డీఎంకే అభ్యర్థి గెలవాలని ఆశిస్తున్నా. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం అన్నారు. భవిష్యత్తులో మీరు మంత్రి కాబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. డీఎంకే గెలిస్తే తాను మంత్రి కావాలా? వద్దా? అనేది తమ నాయకుడే నిర్ణయిస్తారని అన్నారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ చెపాక్-తిరువల్లికేని స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.