#RRR అమెరికా రైట్స్ కొనేసిన సరిగమ
ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం #ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అమెరికా థియేటర్ హక్కుల్ని సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ పంపిణీ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని ఆ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ”భారతదేశపు అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ యుఎస్ఏ థియేట్రికల్ హక్కులను పొందామని చెప్పడానికి మాకెంతో గర్వంగా ఉంది” అని ట్విట్ చేశాయి. ఐతే ఏ రేటుకి హక్కులని తీసుకున్న విషయాన్ని మాత్రం తెలుపలేదు.
ఇప్పటికే ఈ సినిమా హక్కులను తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ దక్కించుకోగా, ఉత్తరాది రాష్ట్రాల్లో పెన్ స్టూడియోస్ సొంతం చేసుకున్నాయి. అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ హక్కులను సైతం పెన్ స్టూడియోస్ కొనుగోలు చేసింది. ఇక రిలీజ్ కి ముందే ఆర్ ఆర్ ఆర్ లాభాల పంట పండిస్తుందని చెప్పుకుంటున్నారు. దాదాపు రూ. 450కోట్ల లాభాలు మిగలనున్నాయని… ఇందులో నిర్మాత, దర్శకుడికి చెరో సగం అని టాక్.
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. ఈ నేపథ్యంలో #RRR కోసం ప్రేక్షకులు భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ చిత్రంలో కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.