కొవిడ్ రోగులకు రూ.1 ఖర్చు లేకుండా చికిత్స
కరోనా టెస్టులు, చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి అద్భుతంగా పని చేస్తోంది. కరోనా మొదటి వేవ్ లో అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ టాప్ లో ఉంది. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలోనూ.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు.
వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమంపై గురువారం సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, నివారణ, సంసిద్ధతపై ప్రధానంగా చర్చించారు. నిత్యం సగటున 1.4 లక్షల మందికి టీకాలను వేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతం తగినన్ని డోసులు లేవని.. కేవలం రెండు రోజులకు సరిపడా నిల్వలే అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. స్పందించిన సీఎం.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా టీకాలు వచ్చేలా చూడాలన్నారు. కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి ఆస్కారం ఉండకూడదన్నారు. కొవిడ్ రోగులకు రూ.1 ఖర్చు లేకుండా చికిత్స అందించాలని స్పష్టం చేశారు.