తెలంగాణలో బృహత్తర విద్యా పథకం అమలు
తెలంగాణలో సర్కారు బడులు బాగుపడనున్నాయా ? ఏకంగా కార్పొరేట్ స్థాయిని అందుకోనున్నాయా ? ఇందుకోసం ప్రణాఌకలు సిద్ధం అవుతున్నాయా ? అంటే.. అవుననే అంటోంది మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ). హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంగ్ల మాధ్యమంలో గురుకులాలను ఏర్పాటు చేశామని కమిటీ పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని.. ఇందుకోసం ఏడాదికి రూ.2వేల కోట్లతో బృహత్తర విద్యా పథకం అమలు చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.