ధోనిపై పంత్ గెలుపు

మొదట్లో మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ పంత్. అయితే ఆ అంచనాలని అందుకోలేకపోయాడు. విమర్శల పాలయ్యాడు. ఇక పంత్ పనైపోయింది. టీమిండియాలో చోటు కష్టమే.. అనుకుంటున్న టైమ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. దాని గిఫ్త్ అన్నట్టుగా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ దక్కింది. శ్రేయస్ అయ్యర్ గాపడటంతో.. పంత్ కి ఈ అవకాశం దక్కింది.

ఇక ఐపీఎల్ 14 లో తొలి మ్యాచ్ నే చెన్నై సూపర్ కింగ్ తో. అంటే గురు-శిష్యుల మధ్య పోరు అన్నమాట. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా శనివారం సాయంత్రం జరిగిన చెన్నై-ఢిల్లీ మ్యాచ్ మాంచి వినోదాన్ని పంచింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. దీంతో.. ధోనిపై పంత్ గెలిచినట్టయింది. గురువుపై శిష్యుడి గెలుపు అన్నమాట.

చెన్నై నిర్ధేశించిన189 పరుగుల భారీ లక్ష్యం నిలిపినా ఢిల్లీ.. 8 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (85; 54 బంతుల్లో 10×4, 2×6), పృథ్వీ షా (72; 38 బంతుల్లో 9×4, 3×6) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు. 

మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంత్.. తనకు స్ఫూర్తిగా నిలిచిన ధోనీపైనే పైచేయి సాధించడంతో ఎంతో ఆనందంగా ఉందన్నాడు. టాస్‌కి ధోనీతో కలిసి వెళ్లడం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు. ఇక బౌలింగులో క్రిస్‌ వోక్స్‌, అవేశ్‌ ఖాన్‌లు చక్కటి ప్రదర్శన చేశారని మెచ్చుకున్నాడు. నార్జే, రబాడల గైర్హాజరీలో కూడా చక్కటి బౌలింగ్‌ చేశారన్నాడు.

ధోని మాట్లాడుతూ.. తమ బౌలింగ్‌ ఆలోచనలు బెడిసికొట్టాయని చెప్పాడు. ఇక ముందు మ్యాచుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. టాస్‌ గెలిస్తే తామూ బౌలింగే తీసుకునేవాళ్లమని చెప్పాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రాత్రి పూట మంచు ప్రభావం ఉంటుందన్న విషయాన్ని ధోనీ గుర్తుచేశాడు.