టీకా ఉత్సవ్.. ప్రజలకు ప్రధాని నాలుగు సూచనలు !
ఈరోజు (ఏప్రిల్ 11) నుంచి 14 వరకు దేశంకో ‘టీకా ఉత్సవ్’ జరగనున్న సంగతి తెలిసిందే. దేశంలో అర్హులైనవారిలో వీలయినంత ఎక్కువ మందికి టీకాలు వేయాలన్న లక్ష్యంతో టీకా ఉత్సవ్‌ను చేపట్టారు. టీకా ఉత్సవం నేపథ్యంలో ప్రధాని దేశ ప్రజలకు నాలుగు సూచనలు చేశారు.
* ప్రతిఒక్కరు- మరొకరికి టీకా వేయించండి: చదువుకోని వారు, వృద్ధులు.. ఇలా ఎవరైతే స్వయంగా వెళ్లి టీకా వేయించుకోలేని స్థితిలో ఉన్నారో వారికి మద్దతుగా నిలవండి.
* ప్రతిఒక్కరు-మరొకరికి చికిత్స అందించండి: వనరులు, అవగాహన లేక ఇబ్బంది పడుతున్న వారికి కరోనా చికిత్స అందజేయడంలో అండగా ఉండండి.
* ప్రతిఒక్కరు-మరొకరిని రక్షించండి: మనం స్వయంగా మాస్క్ ధరించి మనల్ని మనం రక్షించుకోవాలి. ఇతరుల్ని కూడా రక్షించాలి. దీనికి ప్రతిఒక్కరూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
* నాలుగో అంశం.. ఎవరైనా కరోనా బారిన పడితే.. వారి చుట్టుపక్కల ప్రజలు ‘మైక్రోకంటైన్‌మెంట్ జోన్’ ఏర్పాటుకు ముందుకు రావాలి. ఒక్క కేసు వెలుగులోకి వచ్చినా.. వారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఇలాంటి జోన్‌ను సృష్టించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.