వకీల్ సాబ్.. ఇండస్ట్రీ ఫుల్ ఖుషి !

వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రమిది. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీ. ఇంకా ఇండస్ట్రీ ఫుల్ ఖుషి. ఇక పవన్ భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలెరెగురేసుకొని మరీ.. తిరుగుతున్నారు.

ప్రేక్షకులు మాత్రమే కాదు.. టాలీవుడ్ స్టార్స్ వకీల్ సాబ్ కు ఫిదా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని.. మహేష్ బాబు, రామ్ చరణ్, హరీష్ శంకర్.. ఇలా అంతా వకీల్ సాబ్ మీకు సలామ్ అంటున్నారు. లాయర్ పాత్రలో పవన్ నటన హైలైట్. పవర్ ప్యాకెడ్ అని కితాబిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వకీల్ సాబ్ పై ఓ చిన్నపాటి రివ్యూలనే వదులుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని.. లాంటి వాళ్ల రివ్యూలు చూశాం. తాజాగా మహేష్ బాబు, రామ్ చరణ్ లు కూడా వకీల్ సాబ్ రివ్యూలు ఇచ్చేశారు. 

“వకీల్‌ సాబ్‌లో లాయర్‌గా పవన్‌ కల్యాణ్‌ అద్భుతంగా నటించారు. పవన్‌ నటన చాలా శక్తివంతంగా ఉంది. ప్రకాశ్‌రాజ్‌ గొప్ప ప్రతిభాశీలి. నివేదా థామస్‌, అంజలి, అనన్యలు హృదయాన్ని హత్తుకునేలా నటించారు. తమన్‌ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. చిత్ర బృందానికి అభినందనలు” అంటూ మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు.

“కొందరు తెరపై అలా నటిస్తుంటే ఆ సన్నివేశాలు చూసేటప్పుడు ఆనందించడం మాత్రమే కాదు, ఆ సినిమా చూసిన తర్వాత వాటి ప్రభావం మనపై ఉంటుంది. కల్యాణ్ బాబాయి అందులో మీ ‘వకీల్ సాబ్‌’ ఒకటి. ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య, అందరూ బాగా నటించారు. తమన్ నేపథ్య సంగీతం, పిఎస్ వినోద్ గారు అద్భుతమైన కెమెరా పనితనం. వేణు శ్రీరామ్ గారు, మాకు ‘వకీల్‌సాబ్’ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, దిల్ రాజుగారు, శిరీష్ గారు అందరికీ ధన్యవాదాలు అంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో రామ్ చరణ్ రాసుకొచ్చారు.