నా జీవితంలో గొప్ప పని ఇది : ముఖ్యమంత్రి కేసీఆర్

తన జీవితంలో గొప్ప పనిచేశానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. సోమవారం రైతుబంధు, జీవిత బీమా పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా రైతు బీమాపై ఎల్‌ఐసీ- ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరింది. 57లక్షలమంది రైతులకు జీవిత బీమాతో లబ్ది చేకూరుతుందని ఆయ‌న తెలిపారు. రైతు మరణిస్తే 10రోజుల్లోపు రూ.5లక్షల బీమా అందుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు.

రైతుబంధు పథకంపై 89శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. రైతులను ఆదుకోవడం కోసమే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. 18 నుంచి 60ఏళ్ల మధ్య వయసు రైతులందరికీ బీమా వర్తిస్తుందన్నారు. రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో చెరువులన్నీ నీటితో కళకళలాడాలన్నదే తన కల అని చెప్పుకొచ్చారు. వానల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పనిలేదని, 365రోజులూ చెరువులు నింపుతూనే ఉంటామని అన్నారు. బోరుబావులపై ఆధారపడే పరిస్థితిని పోగొడతామన్నారు. 2019 వరకు కాళేశ్వరం పూర్తవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్‌ కొరతను తీర్చామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.