మరోసారి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా గాంధీ
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి ఓపీ సేవలు బంద్ కానున్నాయ్. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో గాంధీని మరోసారి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మారనుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ను కూడా ఆపేసి కేవలం కరోనా కేసులకు మాత్రమే చికిత్స అందించనుంది.
గత యేడాది కరోనా విజృంభించిన సమయంలో గాంధీని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ సేవలు అందించింది. ఏమాత్రం సీరియస్ గా ఉన్న గాంధీకి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో.. గాంధీలో తిరిగి ఓపీ సేవలు ప్రారంభం అయ్యాయ్.
అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. గాంధీలో ఇప్పటికే 450 మందికి పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 150మంది ఆస్పత్రిలో చేరారు. ఐపీ బ్లాక్ మొత్తం ఇప్పటికే కొవిడ్ పేషెంట్స్‌తో నిండిపోయిందని.. ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ గాంధీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో.. గాంధీని మరోసారి పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చినట్టు తెలుస్తోంది.