గ్రేటర్ దెబ్బ.. జనసేన పార్టీ గుర్తు రద్దు !
జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ రద్దయింది. తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు త్వరలో జరగబోయే ఎన్నికల పోటీలో జనసేన తమ సింబల్ ‘గాజుగ్లాస్’ను కోల్పోయింది. దీనికి కారణం పరోక్షంగా భాజాపానే అని చెప్పవచ్చు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ నుంచి ఆఖరి నిమిషంలో జనసేన తప్పుకొని.. భాజాపాకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే.. జనసేన పార్టీ గుర్తు రద్దు అవ్వడానికి కారణమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీచేయని ఆ పార్టీ గుర్తు రద్దయింది.
జనసేనతో పాటు మరో 18 పార్టీల గుర్తులు కూడా ఈ విధంగానే రద్దయ్యాయి. జనసేన (గాజు గ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్ సిలిండర్), ఇండియన్ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్), హిందుస్థాన్ జనతా పార్టీ (కొబ్బరి తోట) పార్టీలు కూడా తమ కామన్ గుర్తులను కోల్పోయాయి. అంతేకాదు.. 2025 వరకు జనసేన కామన్ గుర్తు కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కోల్పోయింది. ఇది జనసేనకు గట్టి దెబ్బే. పార్టీ సింబల్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. గత అసెంబ్లీ
ఎన్నికల్లో #voteforglass అంటూ జనసేన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా.. ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడిప్పుడే పవన్ పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ అని జనాల మదిల్లో రిజిస్టర్ అవుతోంది. ఇంతలో ఆ గుర్తుని రద్దు చేస్తూ.. జనసేనకు కోలుకోని షాక్ ఇచ్చింది ఈసీ. దీనిపై జనసేన వర్గాలు ఎలా స్పందిస్తాయి ? అన్నది చూడాలి.