షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను తీర్చాలని.. వెంటనే ఉద్యోగ ప్రకటనలని విడుదల చేయాలని వైయస్ షర్మిల మూడ్రోజుల నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ ఉదయం షర్మిల ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారు. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని తెలిపారు.
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు షర్మిల ఇప్పటికే ప్రకటించారు. అంతకంటే ముందు ఆమె తెలంగాణలోని వైఎ ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. ఖమ్మంలో భారీ బహిరంగా సభ నిర్వహించారు. జులైలో కొత్త పార్టీ ప్రకటన చేస్తా.. జెండా-అజెండా ప్రకటిస్తామని తెలిపారు. అయితే పార్టీ ప్రకటన కంటే ముందే అమె తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలని ఎత్తుకోవడం విశేషం.
మరోవైపు 50వేల ఉద్యోగాలని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అతి త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని చెబుతోంది. కరోనా విజృంభణ, ఆ వెంటనే పట్టభద్రుల ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నోటిఫికేషన్స్ విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని తెలుస్తోంది. ఎలాగో.. అతి త్వరలోనే తెలంగాణలో ఉద్యోగ ప్రకటనలు రావడం ఖాయం. దానిని మూడ్రోజుల నిరాహార దీక్ష పేరుతో తన ఖాతాలో వేసుకోవడానికి షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.