ఏడుకొండల చుట్టూ ఎన్ని రాజకీయాలో..!?
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొంత కాలంగా నడుస్తున్న రమణదీక్షితులు వ్యవహారం రోజురోజుకు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలలో రాజకీయజోక్యం ఉన్నట్లుగా పైకి కనిపించకపోయినా అంతర్గతంగా ఎవరి ప్రమేయమో ఉందేమో అనే అనుమానాలు భక్తులకు కలుగుతున్నాయి. తిరుమలను పురావస్తుశాఖలో విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నించడం, రమణ దీక్షితులు వ్యవహారం రెండూ ఒకే సారి జరగడం నాటకీయ పరిణామాన్ని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా తిరుమల కీర్తికి భంగం కలిగేలా ప్రస్తుత వ్యవహారం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కు వజ్రపు కిరీటంలా , భక్తజనులకు కొంగు బంగారంగా వెలుగొందుతున్న తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు భక్తులు, దేశ ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. స్వామివారిని, ఆయన వైభవాన్ని కావాడటమే తన జీవితాశయం అని చెబుతున్న టీటీడీ పూర్వ ప్రధానార్చకులు ఏవిధంగా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది. ఒకవేళ తిరుమలలో ఆయన చెబుతున్నదే నిజమే అనుకుంటే ముందుగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి, అక్కడ జరుగుతున్న పరిణామాలపై విచారణ చేపట్టాలని కోరాల్సింది. ఆ తరువాత ప్రభుత్వం ఆయన ఇచ్చిన ఫిర్యాదులను, అంశౄలను పరిగణనలోకి తీసుకోని సందర్బంలో కోర్టుల ద్వారా , చట్టాలను ఉపయోగించి స్వామివారి వైభవాన్ని కాపాడే అవకాశమూ లేకపోలేదు కదా.. ఆయన ఆ దిశగా ఎందుకు వెళ్లలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తనపై వస్తోన్న ఆరోపణలకు సీబీఐ విచారణను కూడా కోరిన దీక్షితులు , 24ఏళ్లపాటు మౌనంగా ఉన్నాననడంలో ఆంతర్యమేంటో తెలియడంలేదు. ప్రభుత్వ నిర్ణయం తనకు న్యాయమనిపించకపోతే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించకుండా రాద్ధాంతం చేయడం వల్ల ఎవరికి లాభం చేకూరుతోంది. స్వామివారి వైభవాన్ని కాపాడకపోగా ఆయన వైభవానికి, తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా రమణ దీక్షితులు వ్యవహారం కనిపిస్తోందన్నది విశ్లేషకుల వాదన. ఇంటి గుట్టు రచ్చకీడ్చిన చందంగా ఆయన వ్యవహార శైలి ఉందనేది తేటతెల్లమవుతోంది.
ఈ పరిణామాలన్నీ గమనిస్తోందటే టీటీడీలో చాపకింద నీరులా రాజకీయ జోక్యం పెరిగిందనేది స్పష్టమవుతోంది. తిరుమల ఆస్తులు, స్వామివారి నగలకు సంబంధించి ఇన్నేళ్ల తరువాత బయటకు చెప్పడం, విచారణకు ఆదేశించమనడంలో ఆంతర్యం వేరే ఉందనడంలోఅర్థమేంటనేది చాలామందిలో సంశయం మొదలైంది. ఏదేమైనా కడుపు చీల్చుకుంటే కాళ్లమీదే పడుతుందన్నట్లుగా వ్యక్తిగత స్వార్థం కోసం తిరుమలను చుట్టూ రాజకీయం చేయడం మన ప్రతిష్టకు , వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ వైభవానికి, ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది.. భక్తితో స్వామివారిని స్మరించుకోవాల్సింది పోయి జరుగుతున్న పరిణామాలు, రాజకీయాల గురించి చర్చించుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ పరిస్థితికి వీలైనంత త్వరగా స్వస్తి పలకకపోతే ఆ ప్రభావం ఇతర ఆలయాలకు విస్తరించి, దేవాలయాలు కాస్తా రాజకీయాలనెలవుగా మారే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త