వాక్సిన్ కొరత ఉంది.. ఆక్సీజన్ కొరత లేదు !
తెలంగాణలో ప్రస్తుతం కొవిడ్ వాక్సిన్ కొరత ఉంది. కానీ ఆక్సిజన్ కొరట లేదన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఆదివారం ఆయన బీఆర్కే భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రోజుకు 10లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. టీకాలు అందుబాటులో లేక ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఇవాళ రాత్రికి 2.7లక్షల డోసులు వస్తాయని సమాచారమిచ్చారు.. వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు. ఆక్సిజన్ కొరత లేకుండా వైద్యశాఖ అధికారులు నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం. ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఉత్పత్తి చేసుకోలేవు. ప్రస్తుతం రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. రోగుల సంఖ్య పెరిగిన కొద్దీ 300 నుంచి 350 టన్నుల వరకు అవసరమయ్యే ఆస్కారముంది అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడక కొరత లేదని, రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఈటెల తెలిపారు.