టీఆర్ఎస్ మంత్రి ఇలాకాలో జోన్ లొల్లి…!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగింది. పది జిల్లాల తెలంగాణ 31జిల్లాలుగా రూపుదిద్దుకుంది. ఈ నేపధ్యంలో జోన్ల వ్యవస్థను కూడా పునర్విభజించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు కూడా అందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి చర్చించిన అనంతరం తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఖరారు చేశారు.
భూపాలపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలతో కాళేశ్వరం జోన్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ ,జగత్యాల జిల్లాలతో బాసర జోన్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో రాజన్న జోన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలతో భద్రాద్రి జోన్, సూర్యపేట, నల్గొండ, యాదాద్రిభువనగిరి , జనగామ జిల్లాలతో యాదాద్రి జోన్ , హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలతో చార్మినార్ జోన్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ , వికారాబాద్ జిల్లాలతో జోగులాంబ జోన్ ను ఇలా తెలంగాణలోని జిల్లాలను ఏడు జోన్ లుగా విభజించారు. అయితే దీనిపై ఇంకా గెజిట్ విడుదల కాలేదు.
ఎక్కడాలేని విధంగా గెజిట్ విడుదలకు ముందే స్వయంగా టీఆర్ఎస్ మంత్రి మహెందర్ రెడ్డి ఇలాకాలో జోన్ ల విభజనపై వ్యతిరేకత వచ్చింది. మంత్రి ఎక్కడ కనబడినా నినాదాలు చేస్తూ ఆయన్ను అడ్డుకున్న పరిస్థితులు కనపబడుతున్నాయి. సొంత పార్టీ వారు కూడా ఈ విషయంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. ఆయన ఎక్కడ కనిపించినా ఆపి మరీ తమను జోగులాంబ జోన్ లో కలపకండంటూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారట. మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఎక్కడ మాట్లాడినా వికారాబాద్ ను జోగులాంబ జోన్ కాకుండా చార్మినార్ జోన్ లో కలిపేందుకు కృషి చేస్తానంటూ చెప్పుకొస్తున్నారట. జోన్ విషయంలో వికారాబాద్ జిల్లా నుంచి అంతలా వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఒకవేళ జోన్ అంశం ఫైనల్ అయిన తరువాత కూడా అదే జోన్ లో ఉంచితే మాత్రం రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో మంత్రికి నష్టం చేకూరుతుందనే వాదన వినిపిస్తోంది.
జిల్లాలో విపక్షాలు జోన్ అంశాన్ని ఓ అస్త్రంగా వాడుకునే అంశం లేకపోలేదని, ఇప్పటికే నిరసనలు,మంత్రి కార్యక్రమాల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జోన్ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట సదరు మంత్రి . జోన్ వ్యవహారం తనకు కొరకరాని కొయ్యగా మారకముందే సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారట. భవిష్యత్ లో పరిణామాలు ఎలా ఉంటాయో, రాజకీయంగా జోన్ ల అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.