TSలో భాజాపా-జనసేన పొత్తు కుదిరింది !
ఏపీలో భాజాపా-జనసేన కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తెలంగాణలో మాత్రం ఆ సఖ్యత లేదు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లోనూ జనసేన మద్దతు భాజాపాకు దక్కలేదు. ఆ పార్టీ తెరాసకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలోనూ భాజాపా-జనసేనల మధ్య పొత్తు కుదిరింది. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఇరు పార్టీల నాయకులు చర్చలు జరిపారు. ఖమ్మంలో పోటీ చేసే అంశంపై నేతల మధ్య స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయించనున్నారు. చర్చల్లో జనసేన పార్టీ తరఫున తెలంగాణ ఇంఛార్జ్ శంకర్‌గౌడ్, రామ్ తాళ్లూరి, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వి.వి.రామారావు పాల్గొన్నారు. భాజపా తరఫున తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.