‘ఆరోగ్యశ్రీలోకి.. కరోనా చికిత్స’ హామీ ఏమైంది ?
గత యేడాది కరోనా విజృంభించిన సమయంలో కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అది కుదరదని మొదట చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ తర్వాత మాత్రం అంగీకరించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో తెలంగాణలో కరోనా కేసులు.. మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.
ఆదివారం మీడియాతో మాట్లాడిన భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రాష్ట్ర ప్రజలందరికీ చికిత్స అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు సరిపోకపోవడంతో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతూ లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు కోమట్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తారా ? కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తారా ? చూడాలి.