ఆ రెండు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారంతరపు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలని విధిస్తున్నాయి. తాజాగా తమిళనాడు, బిహార్‌ ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూ ప్రకటించాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రజా, ప్రైవేటు రవాణా, ఆటోలు, ట్యాక్సీలు ఏవీ తిరగడానికి వీల్లేదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి బీచ్‌లు, పార్క్‌ల్లోకి ప్రజలకు అనుమతి లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో 12వ తరగతి పరీక్షలు వాయిదా వేశారు.

బిహార్ ‌ప్రభుత్వం కూడా రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లను మే 15వ తేదీ వరకూ మూసి వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మూడోవంతు ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. దుకాణాలు, మండీలు, వ్యాపార సంస్థలు సైతం సాయంత్రం 6దాటిన తర్వాత మూసివేయాల్సిందిగా ఆదేశించారు.