రెడ్ లిస్ట్ లో భారత్
గత యేడాది కరోనా విజృంభించిన సమయంలో ఇతర దేశాలని భారత్ రెడ్ లిస్టులో పెట్టింది. కరోనా ఉదృతి అధికంగా ఉన్న యూకే, యుఎస్.. తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఒకానొక సమయంలో అంతర్జాతీయ వినామ సర్వీసులని సైతం రద్దు చేసింది. అయితే ఇప్పుడు.. సీన్ రివర్స్ అయింది. ఇతర దేశాలే భారత్ ని రెడ్ లిస్టులో పెట్టే పరిస్థితి వచ్చింది. తాజాగా యూకే భారత్ ని రెడ్ లిస్టులో పెట్టేసింది.
భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇంగ్లాండ్ ఆంక్షలు విధించింది. భారత్ నుంచి యూకే వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా యూకేకు వచ్చిన 103మందిలో భారత్‌లో వ్యాప్తిచెందుతున్న కరోనా రకాన్ని గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్ హ్యాంకాక్ తెలిపారు. ఇంగ్లాండ్ దారిలోనే మరిన్ని దేశాలు సైతం భారత్ ని రెడ్ లిస్టులో పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 2,59,170 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. నిన్న 1761 మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,80,530కి చేరింది. మరణాల రేటు 1.18శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,31,977 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 13.26శాతానికి పెరిగింది. నిన్న 1,54,761 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.