బ్యాటింగ్’లో ఇబ్బందిపై ధోని వివరణ

ఐపీఎల్ 2021లో ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతోంది. ఇప్పుటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలో రెండింటిలో గెలుపుపొందింది. నిన్నటి మ్యాచ్ లో రాజస్థాన్ ని 45 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో చెన్నై ఫ్యాన్స్ సూపర్ హ్యాపీలో ఉండాలి. కానీ లేరు. దానికి కారణం కెప్టెన్ ధోనినే. పాత ధోనిని చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ధనాధన్ ధోని కనిపించాలని కోరుకుంటున్నారు. కానీ బ్యాటింగ్ లో ధోని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

నిన్నటి మ్యాచ్ లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. నెమ్మదిగా ఆడాడు. ఆరు బంతులు ఆడిన తర్వాత పరుగుల ఖాతా తెరిచాడు. చివరకు 17 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు కొట్టినప్పటికీ.. లయను అందుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీనిపై మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడారు. ఇకపై కూడా గొప్పగా ఆడతానని హామీ ఇవ్వలేనన్నారు.

“నేను నెమ్మదిగా ఆడటం సీఎస్కేకు నష్టం కలిగిస్తుంది. దీనికి అంగీకరిస్తున్నా. కాని ఎల్లప్పుడూ మంచి ప్రదర్శన చేస్తానని హామీ ఇవ్వలేను. నా 24 ఏళ్ల వయసులోనూ బాగా రాణిస్తానని అప్పుడు హామీ ఇవ్వలేదు. ఇప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఇప్పుడు కూడా హామీ ఇవ్వలేను” అన్నాడు మహేంద్రుడు.