10, 12 పరీక్షల రద్దుకు పవన్ డిమాండ్
పది, ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంలాగే ఏపీ కూడా నిర్ణయం తీసుకోవాన్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ప్రభుత్వం చెప్పిన షెడ్యూల్ ప్రకారమే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల కోసం వెళ్లి వచ్చే విద్యార్థుల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందన్నారు.
ఏపీలో 16 లక్షల మందికి పైగా పది, ఇంటర్ విద్యార్థులున్నారని.. వారు కరోనా బారిన పడితే పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. పరీక్షల పెట్టే విషయంలో ప్రభుత్వం సమర్థించుకున్న తీరు హాస్యాస్పదమన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోతే ఆర్మీ ఉద్యోగాలు కోల్పోతారనడం అర్థరహితమన్నారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.