మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు 3లక్షలకు చేరువవుతున్నాయి. మరణాల సంఖ్య 2వేలు దాటిపోయింది. మొత్తం కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 60 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ, పగటిపూట 144 సెక్షన్, వారాంతంలో పూర్తిస్థాయి లాక్డౌన్ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినా.. ఫలితం కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించడానికి మహా ప్రభుత్వం రెడీ అయింది.
కరోనా పరిస్థితులపై మహారాష్ట్ర కేబినేట్ మంగళవారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేసేందుకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి లాక్డౌన్ పై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు ప్రకటన చేస్తారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు రద్దు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపారు.