రెమ్‌డెసివిర్‌ వయల్స్‌’పై కేటీఆర్ హామీ

తెలంగాణ రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ వయల్స్ కొరత ఉందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారం రోజుల్లోగా 4లక్షలకు పైగా రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ తెలిపారు. బుధవారం రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిదారులతో కేటీఆర్‌ చర్చించారు. రెమ్‌డెసివిర్‌ లభ్యత, ఉత్పత్తి, సరఫరా సంబంధిత అంశాలపై వారితో చర్చించారు. వారం రోజుల్లోగా అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు కేటీఆర్ చెప్పారు.

ఇక కరోనా ఉదృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మే 30 వరకు నైట్ కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది కరోనాతో మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,887 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 46,488కి చేరింది.