లాక్డౌన్ భయం.. పల్లెలకు పరుగులు !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతితో.. రోజు రోజుకూ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం రాత్రి కర్ఫ్యూలు, లాక్డౌన్లు అంటూ ఆంక్షలు విధించడం మొదలెడుతోంది. దీంతో మరోసారి వలసకార్మికుల నెత్తిన పిడుగుపడినట్లయింది. గతంలో పడిన కష్టాలు మళ్లీ ఎదురవ్వకూడదనే ఉద్దేశంతో పొట్టకూటి కోసం పల్లెటూరిని విడిచి వచ్చిన వలసకార్మికులు మూటాముళ్లూ సర్దుకొని సొంత ఊళ్లకు బయలు దేరుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ను చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని చెప్పినప్పటికీ రాష్ట్రాలు తమ జాగ్రత్తల్లో తాము ఉంటున్నాయి. దీంతో వలసకార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. దీంతో బతికుంటే బలుసాకు తిని బతకొచ్చనే ఉద్దేశంతో స్వస్థలాలకు పయనమవుతున్నారు. దీంతో మరోసారి నగరాలు ఖాళీ అవుతున్నాయి. ఢిల్లీతోపాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలోనూ లాక్డౌన్ విధిస్తారన్న వార్తలు పుట్టుకొస్తుడంతో.. తెలంగాణలోనూ లాక్డౌన్ తప్పదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది హైదరాబాద్ ని వీడి.. సొంతూళ్లకి పయనం అవుతున్నరు.