ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఆక్సిజన్ అవసరం అమాంతం పెరిగిపోయింది. ఆక్సిజన్ కొరత ఉందంటూ.. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. దీనిపై కేంద్రం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. దీనిపై గురువారం ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
మరోవైపు ఆక్సిజన్ సరఫరాపై రాష్ట్రాల మధ్య వివాదాలు మొదలయ్యాయ్. ఉత్తర్ప్రదేశ్, హరియాణా రాష్ట్రాలు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడంతో, తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నామని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
“ఆక్సిజన్ సరఫరాను ప్రత్యేకించి ఏ ఒక్క రాష్ట్రానికి/ కేంద్ర పాలిత ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసేలా తయారీదారులు, సరఫరాదారులపై ఎలాంటి పరిమితులు లేవు. ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన వాటికి తప్ప..ఏప్రిల్ 22 నుంచి పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరాను నిషేధించాం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది” కేంద్రం ఓ ప్రకటన చేసింది.