గుడ్ న్యూస్ : ఏపీలో ఉచితంగా కరోనా వాక్సిన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం అధికంగా ఉంది. ఏపీలో రోజువారీగా నమోదవుతున్న కేసులు 10వేలకు చేరువవుతున్నాయ్. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకొంది. రేపటి నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్ర‌క‌టించారు. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

ఇక ఏపీ ప్రభుత్వం తీసుకొన్న మరో కీలక నిర్ణయం.. ఉచితంగా కరోనా వాక్సిన్. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వ‌య‌సున్న వారంద‌రికీ కొవిడ్ టీకాను ఉచితంగా అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉచిత వ్యాక్సిన్ కోసం రూ. 1600 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని ప్రభుత్వం అంచనా వేసింది. 

నైట్ కర్ఫ్యూలో భాగంగా అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు. దుకాణాలు, ప్రజా రవాణా, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు. కర్ఫ్యూ నుంచి ఫార్మసీలు, ల్యాబ్‌లు, మీడియా, పెట్రోల్‌ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.