మంత్రి వర్గం నుంచి ఈటెల బర్తరఫ్

మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ భూ ఆక్రమణల ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యవహారం అంతా స్వయంగా సీఎం కేసీఆర్ కన్నుసన్నుల్లో జరిగింది. రైతుల నుంచి సీఎం లేఖ అందిన 24గంటల్లో ఈటెల ఖేల్ ఖతం చేయడం విశేషం. శనివారమే ఈటెల వద్ద ఉన్న ఆరోగ్యశాఖని సీఎం తన పరిధిలోకి తెచ్చుకున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్త్ రఫ్ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

సీఎం కేసీఆర్‌ సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈటెలను బర్తరఫ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు ఈటెల తదుపరి కార్యచరణ ఎలా ఉండబోతుంది ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీలో చేరుతారా ? లేక కొత్త పార్టీ పెడతారా ? అన్నది ఆసక్తిగా మారింది. ఐతే తనకు ఇతర పార్టీలో చేరడం, కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని ఇప్పటికే ఈటెల స్పష్టం చేశారు. అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే.