సెకండ్ వేవ్.. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. అంతేకాదు… పలు పరిశోధనలో సెకండ్ వేవ్ గురించి షాకింగ్ నిజాలు వెలుగులోనికి వస్తున్నాయి. రెండో దశ వైరస్‌ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావవంతమైనదని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్‌ వ్యాపిస్తుందని సదరు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ),ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) నిర్వహించిన పరిశోధన గణాంకాలు ఈ విషయాలను తెలిపాయి.

రెండో దశలో అనేక మంది వైరస్‌ బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్‌ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శనమని టీఐఎఫ్ఆర్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ సందీప్‌ జునేజా తెలిపారు. ఇక దేశంలో సోమవారం ఒక్కరోజే 3,57,229 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 3,449 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 2,22,408 మంది మృత్యువాతపడ్డారు.