ఈటెలపై మంత్రుల ఎటాక్
తెరాస సీనియర్ నేత ఈటెల రాజేందర్ ని స్వయంగా సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. ఆయనపై భూ ఆక్రమణల ఆరోపణలు చేశారు. సక్సెస్ ఫుల్ గా మంత్రి వర్గం నుంచి సాగనంపారు. ఇదంతా తనయుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే. అందుకు అడ్డుగా అనిపించిన ఈటెలని సీఎం కేసీఆర్ తనదైన రాజకీయ వ్యూహాంతో తొక్కేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక ఈటెల వ్యవహారంపై తెరాస నేతలు, మంత్రులు ఇప్పటి వరకు బయటికి నోరు విప్పింది లేదు.
తాజాగా ఇద్దరు మంత్రులు ఈటెలని టార్గెట్ చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఈటెల వ్యవహారంపై మీడియా ముందుకొచ్చారు. తెరాసలో తనకు గౌరవం, విలువ దక్కలేదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తరచూ అసంతృప్తిని వెళ్లగక్కుతూ.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపైనా సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేయడం బాధాకరం. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనడం తప్పు అనిపించలేదా? అని కొప్పుల ప్రశ్నించారు.
మరో మంత్రి గంగుల కమలాకర్ ఈటెలపై కాస్త గట్టిగానే మొరిగారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్ అని మరో మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఆయన హుజూరాబాద్‌లో బీసీ, హైదరాబాద్‌లో ఉంటే ఓసీ అని వ్యాఖ్యానించారు. పదవిలో ఉన్నప్పుడు ఈటలకు బీసీలు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎప్పుడైనా ముదిరాజ్ సమస్యలపై మాట్లాడారా? అని మంత్రి కమలాకర్ నిలదీశారు. మొత్తానికి.. ఈటెల వ్యవహారంలో మంత్రులు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు. టార్గెట్ చేస్తున్నారు. మరీ.. వారి విమర్శలకు ఈటెల రియాక్షన్ ఎలా ఉంటుంది ? అన్నది చూడాలి.