కరోనా కట్టడి.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ వినూత్న ప్రచారం !
మహమ్మారి కరోనాని ఎదుర్కోవాలంటే సరైన అవగాహన అవసరం. తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం కరోనాపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో ప్రయత్నం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడిన వీడియోను యూట్యూబ్‌లో #StandTogether పేరుతో పంచుకుంది.
అందులో ఆలియా భట్ తెలుగులో.. రామ్‌చరణ్ తమిళంలో.. ఎన్టీఆర్ కన్నడలో.. రాజమౌళి మలయాళంలో.. అజయ్‌దేవ్‌గణ్ హిందీలో మాట్లాడుతూ.. కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు తమ సందేశం చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
‘అందరికీ నమస్కారం.. సెకండ్ వేవ్‌లో భాగంగా దేశంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. గతేడాది కలిసిగట్టుగా ఉండి కరోనాకు వ్యతిరేకంగా ఎంతో పోరాడాం. మళ్లీ అలాగే పోరాడదాం. మాస్కు ధరించడం.. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం.. జనంలోకి వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడమే కరోనాపై పోరాడేందుకు మన దగ్గర ఉన్న ఆయుధాలు.
వ్యాక్సిన్‌పై వస్తున్న అపోహలను నమ్మకండి. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను టీకా వేయించుకొనేలా ప్రోత్సహించండి. ఈ సమయంలో ఇంట్లోనే ఉండటం ఎంతో ముఖ్యం. అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి. మాస్కు పెట్టుకోవడంతో పాటు టీకా వేయించుకుంటానని ప్రతిజ్ఞ చేద్దాం. మాస్క్ ధరిద్దాం.. వ్యాక్సిన్ వేయించుకుందాం’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.