తెలంగాణలో కోవిడ్ కొత్త గైడ్ లైన్స్ విడుదల

 రాత్రి కర్ఫ్యూను తెలంగాణ ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జనసమూహం లేకుండా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. పెళ్లిళ్లకు 100 మందికి మించకుండా, అంత్యక్రియలకు 20 మంది మించరాదని స్పష్టం చేసింది. భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, మతపరమైన, సాంస్కృతిక సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు, ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.