భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి : విజయ్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. కొవిడ్ కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఐతే కరోనా భయమే జనాలు చంపేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం కరోనాపై ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో విజయ్ దేవరకొండ తనవంతుగా ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఆయన తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ట్వీటర్ వేదిక ద్వారా స్పందించారు.
“కొవిడ్ రెండో దశ మనదేశం మొత్తాన్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. 2020లోనే అందరం చాలా ఇబ్బంది పడ్డాం. దీన్ని నుంచి బయటపడ్డాం అనుకునే లోపు పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడు లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. మనకి కొవిడ్ లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే చికిత్స తీసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. దగ్గు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ఒంటినొప్పి లాంటివి ఉంటే.. అది కొవిడే అయింటుందని అనుకోండి. వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడటం మొదలెట్టండి. భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి” అని విజయ్ కోరారు.