ఇకనైనా.. లాక్‌డౌన్‌ పెట్టండి !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్ అందక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ అందించాల్సిన కేంద్రం విడతల వారీగా అన్నట్టుగా.. అన్నీ రాష్ట్రాలకు ఆక్సిజన్ సర్థుతోంది. ఇది సర్థుకొని సమయం కాదు. అరక్షణం ఆక్సిజన్ అందడం ఆలస్యమైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి టైమ్ లో లాక్‌డౌన్‌ పెట్టి.. పరిస్థితిని అదుపులోనికి తీసుకురావాల్సిన కేంద్రం మొద్దు నిద్రపోతుంది. ఆఖరి అస్త్రంగా మాత్రమే లాక్‌డౌన్‌ ఉండాలని ప్రధాని అంటున్నారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయేలా ఉంది.

ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మెడికల్‌ సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా మేల్కోవాలంటూ ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఘాటు లేఖ రాసింది.