సమీక్షలు మాత్రమే.. చర్యలుండవ్ !
కరోనా వెలుగులోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వస్తుండు అంటే.. ఓ ధైర్ఘ్యం వచ్చేది. నిజంగానే.. ఆ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ధైర్ఘ్యం గొప్పది. దేశంలో మరో సీఎం ఇవ్వని భరోసా కేసీఆర్ ఇచ్చారు. అందుకే ఆ సమయంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడు ఉంటుందా ? అని జనాలు ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ఆ తర్వాత కరోనాని సీఎం కేసీఆర్ లైట్ తీసుకున్నారు. సెకండ్ వేవ్ లో అయితే చేతులెత్తేశాడు. కరోనాతో కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.
ఇటీవలే కోలుకొని తొలిసారి ప్రగతి భవన్ కి వచ్చిన సీఎం కేసీఆర్.. అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అలాగని లాక్ డౌన్, వారంతరపు లాక్ డౌన్ అంటూ కీలక నిర్ణయాలేమీ తీసుకోలేదు. సీఎం ప్రగతి భవన్ కి వచ్చే ముందురోజే.. సీఎస్ సోమేష్ కుమార్ తో ప్రెస్ మీట్ పెట్టించి.. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది. అంతా బాగుంది అంటూ స్టేట్ మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత రోజు సీఎం కేసీఆర్ సమీక్ష.. దానికి కొనసాగింపు అనిపించింది.
తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేసీఆర్ వారితో చర్చిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మరీ.. ఈసారైనా.. కీలక నిర్ణయాలు ఉంటాయా అంటే ? ఉండవ్. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు. ఇక్కడ సమీక్షలు మాత్రమే.. చర్యలుండవ్ అని జనాలు చెప్పుకుంటున్నారు.