ఎవరో వచ్చి.. మనల్ని కాపాడలేరు !

కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. మందుల్లేక, ఆక్సిజన్ అందక.. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మంచి మనసు చేసుకొని.. సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా తనవంతుగా కరోనా రోగులని ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సరిపోవడం లేదని నిఖిల్ ఆవేధన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో మెసేజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

“కరోనా వల్ల షూటింగ్స్‌ రద్దయ్యాయి. ఆ వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు నేను, నా ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటున్నాం. సోషల్‌ మీడియా ద్వారా నా ఫ్రెండ్స్‌తో కలిసి టీమ్‌ ఏర్పాటు చేశాను. దీని ద్వారా చాలామందికి ఆసుపత్రి బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇంజక్షన్లు అందించడం, ఐసీయూ వార్డులో చేర్పించడం వంటి సలు సహాయక చర్యలు చేపట్టాం. కానీ మేం చేసే సాయం సరిపోవడం లేదు. బయట పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కళ్ల ముందే జనాలు చనిపోతున్నారు. 

ఆక్సిజన్‌ బెడ్‌ కావాలని ఓ కోవిడ్‌ పేషెంట్‌ ఫోన్‌ చేశాడు. అరగంటలో దాన్ని సమకూర్చి ఫోన్‌ చేయగా, అప్పటికే చనిపోయాడని చెప్పారు. ఇలాంటివి చూడటం చాలా బాధగా ఉంది. మనల్ని ఎవరో వచ్చి కాపాడతారనుకోవడం జరగని పని. నాయకులు ఒకర్ని ఒకరు బ్లేమ్‌ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. వాళ్లు మనల్ని కాపాడలేరు. కాకపోతే మానవత్వం ఇంకా మిగిలే ఉంది. జనాలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఈ విపత్కరం సమయంలో అదొక్కటే పాజిటివ్‌ అంశం. దయచేసి మాస్కులు వేసుకోండి, ఎవరినీ కలవకండి” అని చెబుతూ నిఖిల్ భాగోద్వేగానికి గురయ్యారు.

Angry… Sad & Helpless looking at the Covid Deaths around us. #Covid19 #CovidIndia #COVIDSecondWave pic.twitter.com/WGd1czgT0Q— Nikhil Siddhartha (@actor_Nikhil) May 9, 2021